ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తలపెట్టిన ‘సేవ్ ధర్నా చౌక్’ ఆందోళనలను అడ్డుకోవడానికి తెరాస సర్కార్ చాలా కుట్రపూరితంగా వ్యవహరించిందని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈ సమస్య గురించి ఇన్ని రోజులుగా తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ స్పందించని ప్రభుత్వం హటాత్తుగా స్థానిక బస్తీవాసులను ఉసిగొల్పి ఘర్షణ వాతావరణం ఏర్పరిచిందని కోదండరామ్ ఆరోపించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, తెరాస సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలకు, ప్రతిపక్షాలకు మద్య ఘర్షణవాతావరణం కల్పించదని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ ఎటువంటి అవాంచనీయఘటనలు జరిగినా వాటికి తెరాస సర్కార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండిపట్టు వీడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు.