ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ఇందిరా పార్క్ వద్ద కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అక్కడి నుంచి ధర్నాచౌక్ ను నగర శివార్లకు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నేడు ధర్నాచౌక్ వద్ద ధర్నా చేయడానికి అలాగే అక్కడి నుంచి ధర్నాచౌక్ మార్చాలని పట్టుబడుతున్న స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులను కూడా ధర్నా చేయడానికి పోలీసులు అనుమతించారు. ఈ సమస్యను చర్చించుకొని పరిష్కరించుకొనేందుకు వీలుగా ఇరు వర్గాలను అనుమతించినట్లు నగర కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. కనుక పోలీసులు ఎవరినీ అడ్డుకోవడంలేదని, అరెస్ట్ చేయడం లేదని మహేందర్ రెడ్డి చెప్పారు. 

ఇరువర్గాలను పోలీసులు అనుమతించడంతో ఇందిరా పార్క్ వద్ద ఇరువర్గాలు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత వి హనుమంతరావు నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్నారు. వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఇంత కాలం అభ్యంతరం చెప్పని వాకర్స్ క్లబ్ సభ్యులు ఇప్పుడు హటాత్తుగా ఎందుకు అభ్యంతరం చెపుతున్నారంటే వారిని తెరాస సర్కార్ వెనుకనుంచి ప్రోత్సహించినందువల్లేనని మేము భావిస్తున్నాము. ధర్నాచౌక్ ను తరలించినందుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తెరాస సర్కార్ ఈ ఆలోచన చేసినట్లు కనబడుతోంది,” అని అన్నారు. వామపక్షాల ప్రతినిధులు కూడా ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరోవైపు వారికి ఎదురుగా ప్లకార్డులు పట్టుకొని వాకర్స్ క్లబ్ సభ్యులు అక్కడి నుంచి  ధర్నాచౌక్ తరలించాలని నినాదాలు చేస్తున్నారు. తమ బస్తీ మద్యలో ధర్నాచౌక్ వలన తాము, తమ పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీడియా ప్రతినిధులకు వారు వివరిస్తున్నారు. 

ఇంకా తెదేపా, భాజపా, టిజెఎసి సభ్యులు వారి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా సంఘాల ప్రతినిధులు ధర్నాచౌక్ కు రాలేదు. వారు సుమారు 10.30-11.00 గంటలకు అక్కడికి చేరుకోవచ్చు. అప్పుడు పరిస్థితి అదుపు తప్పితే అక్కడే బారీగా మొహరించి ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగవచ్చు.