మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మంలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఖమ్మం మార్కెట్ యార్డుపై జరిగిన దాడి మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి జరిగిన కుట్రే. ఆ విద్వంసానికి పాల్పడింది ఖచ్చితంగా రౌడీ మూకలే. కానీ వారు కెమెరాలకు చిక్కకుండా తెలివిగా తప్పుకొంటే, అమాయకులైన రైతులు దొరికిపోయారు. మిర్చికి గిట్టుబాటు ధర రానందుకు రైతులలో కొంత అసంతృప్తి నెలకొని ఉన్నమాట వాస్తవమే. దానిని ఆసరాగా తీసుకొని కొందరు వారిని రెచ్చగొట్టి ఈ విద్వంసానికి కుట్ర పన్నారు. కొన్ని ఆరాచక శక్తులు రైతులతో కలిసి వెళ్ళి ఈ విద్వంసం సృష్టించాయి. రైతులను పోలీస్ కేసులలో ఇరికించి వారు తప్పుకొన్నారు. మూడేళ్ళుగా మా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేకపోతున్న ప్రతిపక్షాలు, ఈ సమస్యను అడ్డుపెట్టుకొని మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది మిర్చి కొనుగోలు చేసే సంస్థల వద్ద బారీగా మిర్చి నిలువలు ఉండటం, అదే సమయంలో రాష్ట్రంలో మిర్చి దిగుబడి గణనీయంగా పెరగడం చేత ధరలు పడిపోయాయి. అందుకు మా ప్రభుత్వాన్ని నిందించడం తగదు. మా ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటుంది. కానీ ప్రతిపక్షాలు మిర్చి రైతుల ఆందోళనను అవకాశంగా మలుచుకొని వారిని మాపైకి ఉసిగోల్పుతున్నారు,” అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
ఒకప్పటి తెదేపాలో తన సహచరుడు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి “అతను ఒక పిట్టలదొర వంటివాడు. అతని మాటలు తుపాకీ రాముడు మాటలే. వాటిని ఎవరూ పట్టించుకోనవసరం లేదు,” అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అనడం విశేషం.