ధర్నాచౌక్ భాదితుల కష్టాలు కూడా వినాలి

హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్ ను నగరశివార్లకు తరలించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి సోమవారం ధర్నాచౌక్ ను ఆక్రమించుకోవడానికి సిద్దం అవుతున్నారు. వారిని పోలీసులు అడ్డుకొంటారని వేరే చెప్పనవసరం లేదు. కనుక రేపు నగరంలో ఉద్రిక్తవాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.సరిగ్గా ఈ సమయంలో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదివారం ఉదయం హటాత్తుగా ధర్నా చేశారు. ధర్నాచౌక్ వద్ద నిత్యం జరిగే ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల వలన తమ రోజువారి జీవితాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక ధర్నాచౌక్ ను తక్షణమే అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని వారు డిమాండ్ చేశారు. 

స్థానికులు మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ కనీసం 30,000 మంది వరకు నివాసం ఉంటున్నాము. ఇక్కడ ఎవరైనా ధర్నాలు మొదలుపెడితే, వాటికి హాజరయ్యేందుకు అసంఖ్యాకంగా వచ్చే జనాల వలన ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ధర్నాకు వచ్చేవారిలో కొంతమంది మా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆ సమయంలో మహిళలు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

ఇక ధర్నాలో పాల్గొనేందుకు వచ్చేవారితో, వారిని అదుపు చేయడానికి వచ్చే పోలీసులు...వారి వాహనాలతో ఈ పరిసర ప్రాంతాలన్నీ నిండిపోతుంది. దానితో ఆ ధర్నా జరుగుతున్ననాళ్ళు మా పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడానికి దారి ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు మా పనుల మీద మేము ఇంటికీ బయటకు తిరుగుతుంటాము. ధర్నాలో పాల్గొనడానికి వచ్చేవారి వలన మాకు చాలా ఇబ్బంది కలుగుతోంది. 

బస్తీలో ఎవరైనా జబ్బు పడినా, ప్రమాదానికి గురైనా అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా వారు దారి ఇవ్వరు. ధర్నాకు వచ్చిన వచ్చనవాళ్ళు, పోలీసులు కూడా మమ్మల్ని వేరే దారిలో చుట్టూ తిరిగిపొమ్మని ఉచితసలహా ఇస్తుంటారు. ఇక ధర్నాలో పాల్గొనేవారు వాహనాల ఊరేగింపులు, ఆ తరువాత చెవులు చిల్లులు పడిపోయేలా లౌడ్ స్పీకర్లలో పాటలు, ప్రసంగాల వలన మేము మా ఇళ్ళలో ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నారు. 

ధర్నా చేయడానికి వచ్చినవారు త్రాగి పారేసే నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్, వారి భోజనాలలో మిగిలిన పదార్ధాలు, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులతో ఈ ప్రదేశం అంతా ఒక పెద్ద చెత్తకుప్పలాగ మారిపోతుంది. ఇక ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడం వలన ధర్నాలో పాల్గొనేవారు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంటారు. ఆ దుర్గందం భరించలేక మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. 

ఇక అన్నిటికంటే మరో తీవ్రమైన సమస్య ఏమిటంటే, ధర్నా చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలలో తరలిస్తున్న సమయంలో మేము, మా ఆడవాళ్ళు లేదా మా పిల్లలు ఏదైనా పని మీద బయటకు వచ్చి వారి మద్య చిక్కుకొంటే మమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకుపోతుంటారు. మేము ఇక్కడి బస్తీ వాసులమని పోలీసులకు నచ్చజెప్పుకొని బయటపడటం మాకు మరో పెద్ద అగ్నిపరీక్షగా మారుతుంటుంది. స్టేషన్ నుండి మళ్ళీ మేము ఇంటికి చేరుకొనే వరకు ఇంట్లో వారందరూ తీవ్ర ఆందోళన గురవుతుంటారు. 

ధర్నా చౌక్ ఇక్కడ కొనసాగించడం వలన మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు అర్ధం చేసుకోవాలంటే వాళ్ళు కొన్ని రోజులు మా ఇళ్ళలో ఉండి చూడవచ్చు. అనేక ఏళ్ళుగా మేమీ నరకం అనుభవిస్తున్నాము. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకొందని మేము సంతోషిస్తున్నాము. ప్రతిపక్ష నేతలు కూడా మా ఈ సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకొని ధర్నాచౌక్ ఇక్కడ నుంచి వేరే చోటికి తరలించడానికి సహకరించాలని కోరుతున్నాము,” అని బస్తీవాసులు అన్నారు.