ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు దాడి ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు సంకెళ్ళు వేయడం చాలా పొరపాటేనని దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారని అన్నారు. రైతులను అవమానించిన పోలీసులపై తప్పకుండా చర్యలు తీసుకొంటామని మంత్రి చెప్పారు. మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు. కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్షాలు మిర్చి రైతుల సమస్యలను అడ్డుపెట్టుకొని తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.