“తెలంగాణా సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన తెరాస ఒక నీటి బుడగ వంటిది. అది వచ్చే ఎన్నికలలో పగిలిపోతుంది,” అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
“కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలు రాష్ట్రంలో అసలు అమలు కావడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం వేలకోట్లు ఇచ్చింది. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం నిధులు మంజూరు చేసింది. జాతీయ ఆరోగ్య పధకం అమలుకోసం రూ. 1000 కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రప్రభుత్వం బారీగా నిధులు అందిస్తున్నప్పటికీ తెరాస సర్కార్ వాటిని దేనికి ఖర్చు చేస్తోందో తెలియడం లేదు. కేంద్రం అందిస్తున్న నిధులన్నీ ఏమైపోతున్నాయి? ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. తెరాస ఇచ్చిన ఎన్నికల హామీలను సైతం ఇంతవరకు నెరవేర్చలేదు. కేంద్రం అందిస్తున్న ఆ నిధులు, వాటి వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి,” అని డిమాండ్ చేశారు కె.లక్ష్మణ్.
“ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్ళు వేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి,” అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.