“ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి చేసినవారు ఖచ్చితంగా రౌడీలే. తెదేపాకు చెందిన వారే. వారు నిజంగా రైతులే అయితే నేను వారి కాళ్ళకు దణ్ణం పెడతాను. మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ఇటువంటి లఫంగీ..లుచ్చా పనులు చేస్తే చూస్తూ ఊరుకోము.” ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి జరిగినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పిన మాటలివి.
“రైతులను అవమానించే విధంగా వారి చేతులకు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావడం చాలా దారుణం. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతుల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా ఊరుకోము. మాది రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4,000 ఆర్ధిక సహాయం, పంట రుణాల మాఫీ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. రైతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకొంటాము.” ఇది ఆయన తాజాగా అన్న మాటలు.
రైతుల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా ఊరుకోమని చెపుతున్న తుమ్మల మరి ఆరోజు ఇదే రైతులను గూండాలు.. ప్రతిపక్ష పార్టీ తాలూకు మనుషులు...అని ఎందుకు అవమానించారు? వారిపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపించి ఇప్పుడు రైతుల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా ఊరుకోమని తుమ్మల చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇంతకంటే, ఆయన ఆ రైతుల వద్దకు వెళ్ళి వారికి క్షమాపణలు చెప్పి వారి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అందిస్తే రాష్ట్ర రైతాంగం క్షమించవచ్చు.