రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ‘సేవ్ ధర్నా చౌక్’ పేరిట శుక్రవారం నగరంలో గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ చాలా అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రజల గొంతు నొక్కాలనుకొంటే హైదరాబాద్ నగరం అంతా ధర్నాలకు వేదికగా మారుతుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటే అందరికీ మంచిది. లేకుంటే ఈనెల 15న వేలాదిగా ప్రజలతో వచ్చి ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ ను ఆక్రమించుకొంటాము,” అని హెచ్చరించారు.
ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్ళు వేయడంపై స్పందిస్తూ, “అవి వారికి ఒక్కరికే వేసిన సంకెళ్ళుగా భావించలేము. అవి రాష్ట్రంలో యావత్ రైతాంగానికి వేసిన సంకెళ్ళుగా భావించవలసి ఉంటుంది. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న తెరాస సర్కార్ రైతులతో చాలా అమానుషంగా, క్రూరంగా వ్యవహరిస్తోంది. దానిని మేము ఖండిస్తున్నాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.