తెలంగాణా శాసనసభ ఆమోదించి పంపిన భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుదవారం సంతకం చేశారు. కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును నోటిఫి చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దానితో తెలంగాణా రాష్ట్ర భూసేకరణ చట్టం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి ఆ చట్టంలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. సవరించిన ఈ కొత్త చట్టంలో ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో:123లో ఉన్న నిబంధనలన్నీ యధాతధంగా ఉన్నాయి. కానీ ఈసారి దీనిపై ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళే అవకాశం లేనివిధంగా నిబంధనలలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కనుక ఇక ఎటువంటి అవరోధాలు లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసే అవకాశాలు పెరుగుతాయి.