త్వరలో తెలంగాణా వైకాపా ప్లీనరీ సభను హైదరాబాద్ లో నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 6,000 మంది వైకాపా నేతలు ఈ ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. ఈ ప్లీనరీ సభకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. త్వరలోనే ప్లీనరీ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
తెరాస సర్కార్ పాలనలో, హామీల అమలులో వైఫల్యాలు, అప్రజాస్వామిక నిర్ణయాలు, రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, వైద్యం మొదలైన 10 అంశాలపై తీర్మానాలు చేసి ప్లీనరీలో ఆమోదిస్తామని తెలిపారు.
ప్లీనరీ గురించి చర్చించేందుకు రాష్ట్ర వైకాపా వైకాపా నేతలు బుదవారం తమ పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో సమావేశం అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల సాగుభూమి వంటి హామీలన్నీ నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని వైకాపా నేతలు విమర్శించారు. తెరాస సర్కార్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని వైకాపా నేతలు అభిప్రాయం వ్యక్తం చేసి వారిని తెరాస సర్కార్ తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా ప్రజల సమస్యలపై ఏనాడూ బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడని వైకాపా నేతలు, ఇప్పుడు ప్రజల కష్టాల గురించి మాట్లాడటం, తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రజా సమస్యలపై ఏనాడు పోరాడని వైకాపా నేతలు హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహించాలనుకోవడం విడ్డూరంగానే ఉంది. తెలంగాణాలో కూడా వైకాపా ఇంకా సజీవంగా ఉందని ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నారేమో?