ఇదివరకు తెలంగాణా టిజేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో హైదరాబాద్ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు నగరంలో ఎంత ఉద్రిక్తవాతావరణం ఏర్పడిందో అందరూ చూశారు. ఆరోజు నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడానికి నగరాన్ని పోలీసులు దాదాపు దిగ్బంధనం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తో సహా ఆ ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేయడంతో నగరంలో యుద్ద వాతావరణం కనబడింది. మళ్ళీ ఈనెల 15న అటువంటి పరిస్థితులే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించడాన్ని నిరసిస్తూ మే 15న ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఇందిరా పార్క్ లోనే ధర్నా చేయడానికి సిద్దం అవుతున్నాయి. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు చేసిన విజ్ఞప్తిపై ఇంతవరకు స్పందన రాకపోవడంతో వారు మే 15న ఇందిరా పార్కును ఆక్రమించుకొని అక్కడే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ధర్నా చేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయాలని నిశ్చయించుకొన్నారు.
కనుక ఆరోజు అక్కడ ధర్నా చేయడానికి ప్రభుత్వం, పోలీసుల అనుమతి కోరుతూ ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డిజిపికి వినతి పత్రాలు అందించబోతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా జరుపుకొనే తమ ఈ కార్యక్రమానికి ఆటంకాలు కల్పించవద్దని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముందుగా రేపు అంటే మే 12న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిద ప్రజా సంఘాల ప్రతినిధులు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కొంతసేపు మౌన దీక్ష చేస్తారు. ఆ తరువాత వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇస్తారు. ఈ ధర్నాపై ఇంత వరకు తెరాస నేతలు, మంత్రులు ఎవరూ స్పందించకుండా మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈరోజు ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాష్ట్ర డిజిపికి వినతి పత్రం ఇచ్చినప్పుడు, ఆయన స్పందనను బట్టి తెరాస సర్కార్ వైఖరి స్పష్టం అవుతుంది.