జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, వేర్పాటువాదుల దుశ్చర్యలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా తగ్గడం లేదు. దక్షిణ కాశ్మీర్ లో సోఫియాన్ జిల్లాలో తన సమీప బంధువు పెళ్ళి కార్యక్రమానికి హాజరైన ఉమర్ ఫయాజ్ అనే ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని హేర్మిన్ అనే ప్రాంతంలో ఆయన శవాణ్ని పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకొన్నారు. శవంపై బులెట్ గాయాలుండటంతో అది ఉగ్రవాదులు లేదా వేర్పాటువాదులపనే అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన బుదవారం రాత్రి జరిగింది.
విశేషం ఏమిటంటే ఉమర్ ఫయాజ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారే. ఆయన ఆర్మీలో చేరి కేవలం 5 నెలలే అయ్యింది. కాశ్మీరీ యువత వేర్పాటువాదం, ఉగ్రవాదం వైపు నుంచి మళ్లించేందుకు కేంద్రప్రభుత్వం వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించడానికి వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఆ కారణంగానే ఇటీవల జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో అనేకమంది కాశ్మీరీ యువకులు కూడా పాల్గొని ఆర్మీలో చేరారు. కానీ వారి మానసికస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావించవలసి ఉంటుంది.