అవినీతిని ప్రక్షాళన చేయడానికే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకొనే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైనే అవినీతి ఆరోపణలు రావడంతో ఆమాద్మీ పార్టీ, ప్రభుత్వం రెండూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రిపై ఎసిబి విచారణకు ఆదేశించడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు తన శిష్యుడైన అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన ఈ అవినీతి ఆరోపణలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా చాలా ఘాటుగానే స్పందించారు.
ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలకు నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉండి ఉంటే, ఆయన రాజీనామా కోరుతూ నేనే డిల్లీలో నిరాహార దీక్ష చేసేవాడిని. ఏసిబి దర్యాప్తులో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువైన పక్షంలో ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయడం మంచిది. లేకుంటే నేను నిరాహార దీక్ష చేస్తాను. కేజ్రివాల్ తన నిజాయితీని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఆయన రూ.2 కోట్లు లంచం తీసుకొంటుండగా తను కళ్ళారా చూశానంటున్న కపిల్ మిశ్రా ఆ సంగతి అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు? ఇంతకాలం తరువాత కేజ్రీవాల్ పై చేయడం అనుమానాలకు తావిస్తోంది,” అని అన్నా హజారే అన్నారు.
అవినీతి ఆరోపణల కారణంగా తన రాజీనామాకు అన్ని వైపులా ఒత్తిడి వస్తునప్పుడు, కేజ్రీవాల్ తన నిజాయితీని నిరూపించుకొని వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయకుండా. డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భాజపా ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందని నిరూపించేందుకు, ఈరోజు డిల్లీ శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించడం విశేషం. ఆ సభలో ఈవిఎంలను ఏవిధంగా ట్యాంపరింగ్ చేయవచ్చో కంప్యూటర్ నిపుణుడైన ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వివరించారు.