డిల్లీ వెళ్ళినా కీచులాటలే..

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల మద్య నిత్యం ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. డిల్లీలో ఉన్న ఆంధ్రా, తెలంగాణా భవన్ విషయంలోను అధికారుల మద్య నిన్న కొంతసేపు గొడవ జరిగింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా దానినీ 58:42 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు విభజించారు. దానిలో శబరి బ్లాక్ తెలంగాణా రాష్ట్రానికి కేటాయించబడిందని తెలంగాణా అధికారి టి.రామోహన్ చెప్పారు. ముఖ్యమంత్రి లేదా గవర్నర్ నరసింహన్  ఎప్పుడైనా డిల్లీ వస్తే అందులో బస చేయడానికి దానిని కేటాయించామని, కానీ ఏపి అధికారులు అది తమదని వాదిస్తూ వాడుకొంటున్నారని అన్నారు. 

ముఖ్యమంత్రి, గవర్నర్ డిల్లీ రావడం తక్కువే. వచ్చినా దానిలో బస చేయడం కూడా అరుదే కనుక అది ఖాళీగానే ఉంటోంది. అది గమనించిన ఏపి భవన్ లోని ఆంధ్రా అధికారులు ఆ బ్లాకును స్వాధీనం చేసుకొని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. 

ఈ విషయం తెలిసిన తెలంగాణా అధికారులు ఆ భవనానికి తాళం వేసి, తమకు కేటాయించబడిన ఈ భవనాన్ని ఇతరులు ఎవరూ ఉపయోగించరాదని ఒక నోటీస్ అంటించారు. ఈ సంగతి తెలుసుకొన్న ఏపి అధికారులు అక్కడికి వచ్చి ఆ తాళం పగులగొట్టి మళ్ళీ ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అది ఏపికి కేటాయించబడినదని, దానికి తెలంగాణా అధికారులు తాళం వేసి నోటీస్ అంటించినందుకు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మద్య కాసేపు తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఇరు పక్షాలు తమ తమ రెసిడెంట్ కమీషనర్లకు పిర్యాదులు చేసుకొన్నారు.