పాక్ పై భారత్ అలా ప్రతీకారం తీర్చుకొంది

ఈ నెల 1న పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ సెక్టార్ లో కృష్ణ ఘాటి అనే ప్రాంతంలోకి జొరబడి అక్కడ గస్తీ కాస్తున్న ఇద్దరు భారత్ జవాన్లను చంపి, వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసి, వారి తలలు నరికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత సైనికులు, సరిహద్దుకి సమీపంలోనే పాక్ వైపున్న బంకర్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశారు. దాని తాలూకు వీడియో ఈరోజు బయటకు వచ్చింది. ఆ దాడి ఎప్పుడు జరిగిందో, దానిలో ఎంతమంది పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు చనిపోయారో ఇంకా తెలియవలసి ఉంది. అయితే ఈ దాడి గురించి భారత ఆర్మీ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై పాక్ కూడా ఇంకా స్పందించవలసి ఉంది. 

భారత్ జవాన్లపై జరిగిన దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకొంటామని, పాక్ పై ఊహించని విధంగానే దాడి చేస్తామని ఆరోజే ఆర్మీ జనరల్ శరత్ చంద్ చెప్పారు. బహుశః అది ఇదేనేమో? కానీ ఇదివరకు సర్జికల్ స్ట్రయిక్స్ విజయవంతంగా చేసి వచ్చిన తరువాత ఆ విషయాన్ని వెంటనే ప్రకటించిన ఆర్మీ, భారత ప్రభుత్వం, ఈ తాజా దాడిని అధికారికంగా దృవీకరించకపోవడం చేత ఇది ఇప్పుడు జరిగినదేనా లేక ఇదివరకు ఎప్పుడో జరిగినదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి గురించి దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి కనుక బహుశః నేడో రేపో కేంద్ర ప్రభుత్వం స్పందించవచ్చు.