డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరుడు సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్లు లంచం తీసుకొంటుండగా తాను స్వయంగా చూశానని ఆమాద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలతో ఆ పార్టీలో, ఆమాద్మీ ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అవినీతిని నిర్మూలిస్తానని చెపుతూ అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా మరొక మంత్రి దగ్గర నుంచే లంచం తీసుకోవడం ఏమిటి? అది నిజమా కాదా? అని ఆలోచించకుండా, ఇదివరకు ఆయనను భుజానికి ఎత్తుకొని మోసిన మీడియా కూడా ఈ వార్తని హైలైట్ చేస్తుండటం విశేషం.
పార్టీ నుంచి బహిష్కరించబడిన వాళ్ళు లేదా మంత్రిపదవులు రాక వేరే పార్టీలోకి మారినవాళ్లు ఆ అసూయతో ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం లేదా తమ పార్టీపై ఇటువంటి ఆరోపణలు చేయడం సహజమే. వాటిలో నిజానిజాలు నిర్దారించుకోకుండా నమ్మడం సరికాదు. కపిల్ మిశ్రా ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ వ్యవహారంపై ఎసిబి దర్యాప్తుకు ఆదేశించారు. వారం రోజులలోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే లంచం తీసుకొని ఉంటే చట్టప్రకారం శిక్ష అనుభవించవలసిందే. కానీ భాజపా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం కుంభకోణం బయటపడి 19 ఏళ్ళు అయ్యింది. దానిపై కూడా కేంద్రప్రభుత్వం ఇదే స్పీడుతో స్పందించి ఉంటే ఇప్పుడు ఎవరూ దానిని వేలెత్తి చూపేవారు కాదు. దాని చిత్తశుద్ధిని ఎవరూ శంఖించేవారు కాదు.
సాక్షాత్ ఆ రాష్ట్ర గవర్నర్ మొదలు మంత్రులు, వారి బందువులు, అనేకమంది ఉన్నతాధికారులు, ప్రభుత్వోద్యోగులు, చివరికి విద్యార్ధుల తల్లితండ్రులకు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. సుమారు 2,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ కేసుతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా సుమారు 54 మంది అనుమానాస్పద పరిస్థితులలో హటాత్తుగా చనిపోయారు. కానీ ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. కానీ డిల్లీ ముఖ్యమంత్రిపై ఒక ఆరోపణ రాగానే వెంటనే గవర్నర్ ఎసిబి దర్యాప్తుకు ఆదేశించడం వారం రోజులలోగానే నివేదిక కోరడం చూస్తే కేజ్రీవాల్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లే కనిపిస్తోంది.