12మంది ఇంజనీర్లు..18మంది కాంట్రాక్టర్లు అరెస్ట్!

జి.హెచ్.ఎం.సి. చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరుగని విధంగా అవినీతి ఆరోపణలపై ఏకంగా 12 మంది ఇంజనీర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతకు ముందు అదే కారణాలతో 18 మంది కాంట్రాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. అది వేరే సంగతి. కానీ అవినీతి కేసులో ఒకేసారి ఒకే సంస్థ, ఒకే ప్రాంతానికి చెందిన ఇంతమంది అధికారులు, కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. 

కొన్ని నెలల క్రితం కురిసిన బారీ వర్షాలతో నగరంలో రోడ్లన్నీ పెద్ద పెద్ద చెరువుల్లా మారిపోయిన సంగతి తెలిసిందే. నగరంలోని నాలాలు పూడిక తీయించడానికి ప్రభుత్వం ఏటా కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేస్తూనే ఉంది. గతః ఏడాది కూడా రూ.24కోట్లు మంజూరు చేసింది. ఆ పనుల్లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిసి బారీగా అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించడంతో డానికి బాధ్యులైనవారందరిపై ఒకేసారి చర్యలు తీసుకొంది. వారు ఇంతకు బారి తెగించారంటే నకిలీ వే బిల్లులు సృష్టించడమే కాకుండా నాలాలలో తీసిని వ్యర్ధాలను ద్విచక్రవాహనాలలో, ఆటో రిక్షాలలో తరలించినట్లు రశీదులు సృష్టించారు. వారి ఆ అత్యాశ, అతితెలివే వారి కొంప ముంచిందని చెప్పవచ్చు.

అరెస్టైన ఇంజనీర్ల పేర్లు: పి.ప్రేరణ, పాపమ్మ, కామేశ్వరి, మోహన్‌రావు, సంతోష్‌,లాల్‌సింగ్‌, వశీధర్‌, శంకర్‌, శ్రీనివాస్‌, నాయుడు,  అశోక్‌, జమీల్‌ షేక్‌.

కేటిఆర్ మున్సిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఆయన హెచ్చరికలను అందరూ లైట్ తీసుకొని నాలాల మురికి సంపాదనలో మునిగి తేలుతూ అడ్డంగా దొరికిపోయారు. ఇది మిగిలిన ప్రాంతాలలో ఇతర శాఖలలో పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లకు అందరికీ ఒక హెచ్చరిక వంటిదేనని చెప్పవచ్చు.