ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ భవనం నిర్మించాలని చాలా పట్టుదలగానే ఉన్నట్లున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్న కారణంగా ఎర్రగడ్డలోని టిబి, మానసిక ఆసుపత్రులను నగర శివార్లకు తరలించి అక్కడ రూ. కోట్లు వ్యయంతో కొత్త సచివాలయ భవనం నిర్మించాలనుకొన్నారు. కానీ ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ తరువాత ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి వేసి దాని స్థానంలో కొత్తది కట్టాలనుకొన్నారు. కానీ దానిలో ఏపి సర్కార్ అధీనంలో ఉన్న కొన్ని బ్లాకులను అది ఖాళీ చేసి అప్పగించడానికి నిరాకరించడంతో, ఇప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భాగంగా ఉన్న బైసన్ పోల్ మైదానంలో నూతన సచివాలయం నిర్మించాలనుకొంటున్నారు.
ఆ ప్రాంతం రక్షణశాఖ అధీనంలో ఉన్నందున దానిని పొందేందుకు తెరాస సర్కార్ డిల్లీలో పావులు కదుపుతోంది. మొదట రక్షణ శాఖ అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఆప్రాంతంలో ప్రస్తుతమ ఉన్న మార్కెట్ ధరను తెరాస సర్కార్ చెల్లించడానికి ఇష్టపడితే, ఆ భూమిని అప్పగించడానికి సిద్దమని చెప్పినట్లు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలం కొన్ని వందల కోట్లు ఖరీదు ఉంటుంది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించింది. ఒకవేళ మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమికి ధర చెల్లించవలసి వస్తే ఆ డబ్బు కూడా భూమి కొనుగోలుకి కూడా సరిపోకపోవచ్చు.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2న అక్కడ కొత్త సచివాలయ భవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంటే రక్షణశాఖ అడిగినంత ధర చెల్లించి ఆ భూమిని తీసుకోవడానికి కేసీఆర్ సిద్దపడుతున్నట్లు భావించవచ్చు. ఈలోగా డిల్లీ స్థాయిలో చర్చలు పూర్తయితే అదే ముహూర్తానికి శంఖుస్థాపన చేయడం కూడా ఖాయంగానే భావించవచ్చు. నిర్మాణం మొదలుపెడితే ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మరి అయన కల నెరవేరుతుందో లేదో చూడాలి.