ఏటా జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు ఈసారి హైదరాబాద్ లో జరుగబోతున్నాయి. ఈ ఏడాది తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి నుంచే అంటే జూన్ 2 నుంచి వారం-పది రోజుల పాటు ఈ సభలను నిర్వహించడానికి తగిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వీటి ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, "బమ్మెర పోతన కాలం నుంచి నేటి వరకు మన తెలంగాణా సాహిత్యకారులు అనేక అద్భుతమైన రచనలు చేశారు. అలాగే సంగీతం, కళలు, అవధానం, హరికధలు, బుర్రకధలు వంటి వివిధ కళారూపాల ద్వారా తమ గొప్పదనాన్ని చాటుకొన్నారు. వాటన్నిటినీ ఈ సందర్భంగా మనం లోకానికి చాటి చెప్పేవిధంగా మనం కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలను వేదికగా ఉపయోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తో సహా ముంబై, భివండి, సూరత్, చెన్నై, డిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాలలో ఉన్న తెలుగు సాహిత్యకారులను, కళాకారులను ఈ సభలకు ఆహ్వానించాలి.
పగలు వారితో సభలు, సదస్సులు, విద్యార్ధులకు వ్యాస రచన, వక్తృత్వ, కవిత పోటీలు వంటివి నిర్వహిస్తూ సాయంత్రం పూట సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలి. ఈ సభలలో మన తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభిభించే మన సాహిత్యం, కళలు మొదలైన వాటి గురించి లోకానికి చాటి చెప్పేవిధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శనం చేశారు.