భాజపా మైండ్ గేమ్ ఆడుతోంది: దానం

ఆ మద్యన తెరాసలో చేరాలని ఊగిసలాడిన సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్, ఇప్పుడు భాజపాలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని పుకార్లు మొదలయ్యాయి. ఆయనతో బాటు అంజన్ కుమార్ యాదవ్, డిటి నాయక్ మరికొందరు నేతలు కూడా భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ను ఇటీవల నగరంలో ఒక హోటల్ లో రహస్యంగా కలుసుకొని భాజపాలో చేరడం గురించి చర్చించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ పుకార్లపై దానం నాగేందర్ స్పందిస్తూ, “ఇవన్నీ మాపై ఒత్తిడి పెంచడానికి భాజపా ఆడుతున్న మైండ్ గేమ్స్. మేము కాంగ్రెస్ పార్టీని వీడము. భాజపాలో చేరే ఉద్దేశ్యం అసలే లేదు. భాజపాకు చెందిన సోషల్ మీడియా పనిగట్టుకొని ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతోంది. సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సర్వసాధారణం అయిపోయాయి. వాటి వాళ్ళ మావంటివారికి చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. సోషల్ మీడియాలో మాపై ఏవో పుకార్లు వచ్చినట్లు తెలియగానే మేము పనిగట్టుకొని మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించవలసి వస్తోంది. అవి మామూలే అని ఊరుకుంటే మా పార్టీకి, ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. మేము భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న ఆ వార్తలలో నిజం లేదు. వాటిని మేము ఖండిస్తున్నాము. దయచేసి సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు వ్యాపింపజేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.