తండ్రీకొడుకుల డ్రామా..సెకండ్ ఎపిసోడ్

పదేళ్ళపాటు  యూపిని పాలించి, రాష్ట్రాన్ని అన్నివిధాల భ్రష్టు పట్టించిన సమాజ్ వాదీ పార్టీ, శాసనసభ ఎన్నికలకు ముందు కుటుంబ కలహాలతో రోడ్డునపడి మిగిలిన పరువును కూడా చేజేతులా పోగొట్టుకొని భాజపా చేతిలో అతి దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాతైనా తండ్రీకొడుకులు జరిగిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది.

ములాయం, అఖిలేష్ యాదవ్ వర్గాలమద్య సయోధ్య కుదరకపోవడంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కొడుకు నుంచి వేరుపడి మళ్ళీ ‘సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా’ అనే కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. దానికి ములాయం సింగ్ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ తెలిపారు. త్వరలోనే లక్నోలో బహిరంగ సభ నిర్వహించి తమ కొత్త పార్టీ గురించి అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే, సమాజ్ వాదీ పార్టీలో తండ్రికొడుకులు వేరు కుంపట్లు పెట్టుకోవడం విశేషం.