రెండు రోజుల క్రితమే ప్రముఖ తెలుగు టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు మరొక ప్రముఖ కన్నడ, తమిళ టీవి నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె తన స్నేహితులతో కలిసి తన కారులో చెన్నై నుంచి బెంగళూరు వెళుతుండగా తమిళనాడులోని వెల్లూర్ జిల్లా పరణంపట్టు అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. వారి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని డ్డీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి క్రిందపడింది. ఆ ధాటికి రేఖ సింధుతో సహా ఆమె ముగ్గురు స్నేహితులు కూడా అక్కడే చనిపోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకొని వారి శవాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఆమె స్నేహితుల పేర్లు: అభిషేక్ కుమరన్ (22), జయన్ కందరన్ (23), రక్షణ్ (20).