పరిశుభ్రతలో హైదరాబాద్ ర్యాంక్ ఎంతో తెలుసా?

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వచ్చా భారత్ పధకాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు ప్రోత్సహిస్తోంది. అది మంచి ఆలోచనే. కానీ దాని అమలులో మన ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధి కనబరుస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక మంచి ఆలోచనతో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించడం అవసరమే. ఈ ఏడాది దేశంలో స్వచ్చా సర్వేక్షన్ లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పరిశుభ్రత పాటిస్తున్న 434 నగరాలు, పట్టణాలను ఎంపికచేసి ఈరోజు ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకులను ప్రకటిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మనం మన శరీరాన్ని ఏవిధంగా శుభ్రంగా ఉంచుకొంటామో, అదే విధంగా మన ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేశమంతా పరిశుభ్రంగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ పధకం ప్రవేశపెట్టాము. మెల్లగా ఆశించిన ఫలితాలు కనబడుతున్నాయి. పరిశుభ్రత పాటించడం అనేది ఒక రోజుతో ముగిసేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. వచ్చే రెండేళ్ళలో దేశంలో అన్ని ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా మారడానికి పోటీ పడాలని కోరుకొంటున్నాను. కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ర్యాంకుల వివరాలు: 

మన తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్‌ హైదరాబాద్ కు 22వ స్థానం, వరంగల్‌ 28, సూర్యాపేట 30, సిద్ధిపేట 45వ స్థానంలో నిలిచాయి.

ఏపిలో విశాఖపట్నం-3, తిరుపతి-9, విజయవాడ-19, తాడిపత్రీ-31, నర్సారావుపేట-40వ ర్యాంకు సాధించాయి.  

ఇక దేశంలో టాప్ 10 నగరాలలో  1. ఇండోర్, 2. భోపాల్, 3. విశాఖపట్నం, 4. సూరత్, 5. మైసూర్, 6. తిరుచురాపల్లి, 7. న్యూడిల్లీ (మున్సిపల్‌ కౌన్సిల్‌), 8. నవీ ముంబయి, 9. తిరుపతి, 10. వడోదర వరుసగా నిలిచాయి.

వీటిలో తెలంగాణా రాష్ట్రం నుంచి 4, ఏపి-8, మధ్యప్రదేశ్-11, గుజరాత్-12 నగరాలు, పట్టణాలు ఎంపిక అయ్యాయి.  

ఇక మిగిలిన నగరాలూ, పట్టణాలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి 32వ స్థానం దక్కింది. బిహార్ లోని కతిహార్-430, యూపిలోని హర్దోయ్-431, బాగాహ-432( బిహార్), భస్వాల్ -433 (మహారాష్ట్ర), అన్నిటి కంటే చివరి స్థానంలో గొండా 434 (ఉత్తరప్రదేశ్) నిలిచాయి.