కాంట్రాక్టు ఉద్యోగుల కోసం సుప్రీంకి వెళ్తాం

 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడానికి ఇచ్చిన జివోను హైకోర్టు కొట్టివేయడంతో తెలంగాణా ప్రభుత్వం పునరాలోచన చేసి దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నట్లు తెరాస ఎంపి బాల్క సుమన్ చెప్పారు. నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగుల కోసం త్వరలో 8792 ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే గురుకుల ఉపాద్యాయుల పోస్టుల భర్తీకి అర్హతలను సడలించామని చెప్పారు. అదే విధంగా విద్యుత్ శాఖలో ఒకేసారి 13,000 ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. 

నిరుద్యోగ యువతకు బారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నిరుద్యోగ యువతకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయవలసిన బాద్యత తమ ప్రభుత్వం మీదే ఉందని కనుక ఉద్యోగాల సమస్యపై యువత చెప్పుడు మాటలను పట్టించుకోవద్దని బాల్క సుమన్ కోరారు.