ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీలో కొందరు కేంద్రమంత్రులతో సమావేశమయ్యి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడిన తరువాత రాత్రి 1.30 గంటలకి అమెరికా ప్రయాణం అవుతారు. వారం రోజుల పాటు సాగే ఈ అమెరికా పర్యటనలో ఆయనతో పాటు మొత్తం 15 మంది ఉన్నారు. వారితో బాటు ఏపి రాష్ట్ర ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళవలసి ఉంది. కానీ బహుశః ప్రతిపక్షాల విమర్శల కారణంగా ఆఖరు నిమిషంలో అయన అమెరికా పర్యటన విరమించుకొన్నట్లున్నారు. ఈ పర్యటన పెట్టుబడులను ఆకర్షించేందుకేనని వేరేగా చెప్పనవసరంలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు బృందం అమెరికాలో వివిధ నగరాలలో పర్యటించి అక్కడి ప్రవాసాంద్రులను, పారిశ్రామికవేత్తలను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలుసుకొని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరుతారు.
గత మూడేళ్ళలో చంద్రబాబు నాయుడు బృందం ఇదేపని మీద సింగపూర్, జపాన్, అమెరికా, చైనా తదితరదేశాలను చుట్టి వచ్చింది. కానీ నేటి వరకు ఎంత పెట్టుబడులు వచ్చాయో..ఎక్కడ ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయో వారికే తెలియాలి.
ఆ తరువాత నారా లోకేష్ (ప్రభుత్వంలో ఎటువంటి పదవీ నిర్వహించకపోయినా) ప్రభుత్వం తరపున అమెరికా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి వందల కోట్లు పెట్టుబడులు ఆకర్షించినట్లు తెదేపా, దాని బాకా మీడియా గొప్పగా చెప్పుకొంది. కానీ వాటి సంగతీ ఎవరికీ తెలియదు. ఆ సందర్భంగా లోకేష్ అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో ఫోటోలు దిగి వచ్చారు. అదొక్కటే కనిపిస్తోంది.
ఈ మూడేళ్ళలో ఏపి సర్కార్ రెండుసార్లు విశాఖలో సి.ఐ.ఐ. సదస్సులు చాలా అట్టహాసంగా నిర్వహించింది. వాటిలో కూడా లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. కానీ వాటిలో ఎన్ని ఆచరణ రూపం దాల్చాయో ఏపి సర్కార్ కే తెలియాలి. మళ్ళీ ఇప్పుడు ‘రాజు వెడలె రవి తేజము లరియగా’ అన్నట్లు ఏకంగా 15మందితో ఛలో అమెరికా అంటూ బయలుదేరుతున్నారు. మరి ఈసారి ఏమి సాధించామని చెపుతారో చూడాలి. ఆఖరు నిమిషంలో నారా లోకేష్ వెనక్కి తగ్గినందున ఆ మేరకు ప్రజాధనం మిగిలిందని సరిపెట్టుకోవాలేమో?