పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మొన్న గాంధీ భవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ తెరాస సర్కార్ పాలన, ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
“కేసీఆర్ వైఖరి, పాలన తీరు, ఇతర కారణాల చేత పార్టీలో అసంతృప్తి గూడు కట్టుకొని ఉందనే సంగతి ఆయన ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆ పార్టీకి చెందిన అనేకమంది నేతలు నాతో టచ్చులోనే ఉన్నారు. తెలంగాణా ఇంటలిజన్స్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏది నచ్చుతుందో అదే చెపుతున్నారు తప్ప వాస్తవపరిస్థితుల గురించి చెప్పడం లేదని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రికి భయపడి తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా వాస్తవ పరిస్థితుల గురించి చెప్పలేకపోతున్నారు. ఆయనకు రాష్ట్రంలో రైతుల వాస్తవ పరిస్థితులు అసలు తెలుసో తెలియదో అన్నట్లుంది అయన వ్యవహారం. బహుశః అందుకే ఖమ్మం మిర్చి యార్డుపై దాడి చేసినవారు చేసిన మిర్చి రైతులపై ద్రోహులు, గూండాలు అని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ రైతులందరూ ప్రభుత్వ పక్షాన్నే ఉంటె వారు ఆవిధంగా ఎందుకు దాడి చేశారు? రోడ్లపైకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు నేతలు రైతులను కలవడానికి మార్కెట్ యార్డులకు వెళితే తెరాస నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారు?” అని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
తెరాస సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, “దానిపై నేను త్వరలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా దానిలో లోపాలను వివరిస్తాను. సుమారు 2000 అడుగులు ఎత్తుకి నీటిని ఎత్తిపోయడం, ఆ నీటిని పంటలకు చేర్చేందుకు 200 కిమీ పొడవునా కాలువలు తవ్వడం వలన ఒక ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. అది చాలా వ్యవప్రయాసలతో కూడుకొన్న వ్యవహారం అని తెలిసి ఉన్నప్పుడు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఉంటే బాగుండేది కదా?ఒక ఎకరాకు నీళ్ళు అందించడం కోసం అంత డబ్బు ఖర్చు చేయడం కంటే అదేదో రైతులకే ఇస్తే బాగుంటుంది కదా? అని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు.