రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా పొడిగిస్తూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు గవర్నర్ గా కొనసాగాలని ఆ ఆదేశంలో సూచించినట్లు సమాచారం. ఇటీవల గవర్నర్ నరసింహన్ డిల్లీ వెళ్ళినప్పుడు మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరినట్లు సమాచారం.
నిజానికి నరసింహన్ పదవీ కాలం నేటితో (మే 2) ముగుస్తుంది. ఆయన జనవరి 2010 లో సమైక్య రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. యూపిఏ ప్రభుత్వం 2012 మే 3న మరో ఐదేళ్ళ పాటు పదవీకాలం పొడిగించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా నేటి వరకు ఆయననే గవర్నర్ కొనసాగించడమే కాకుండా మళ్ళీ ఈరోజు మరోమారు అయన పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగించింది.
ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇరువురూ కూడా అయన పట్ల మంచి అభిప్రాయమే కలిగి ఉన్నారు. వారితో అయనకు సత్సంబంధాలే ఉన్నాయి కనుక ఆయననే గవర్నర్ గా కొనసాగించడం మేలని కేంద్రప్రభుత్వం భావించి ఉండవచ్చు.