కేసిఆర్ ని బోనులో నిలబెడతాను జాగ్రత్త!

తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ స్వయంగా ఒక నకిలీ ఐసిస్ ఉగ్రవాద వెబ్ సైటును సృష్టించి, దాని ద్వారా రాష్ట్రంలో ముస్లిం యువతను తీవ్రవాదం వైపు వెళ్ళేందుకు ప్రోత్సహిస్తోందని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఆయనకు, తెరాస సర్కార్ కు మద్య మాటల యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 

భాద్యతారాహిత్యంగా చేసిన ఆ ఆరోపణలను ఆయన వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదా తన ఆరోపణలను నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపాలని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఆ రెండూ చేయకపోతే ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసివస్తుందని నాయిని నరసింహా రెడ్డి హెచ్చరించారు కూడా. 

కేటిఆర్ హెచ్చరికలపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, “నేను నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు. కావాలనుకొంటే వారు నాపై కేసు పెట్టవచ్చు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా, ఎంపిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా చిరకాలం పనిచేసిన నేను ఏ ఆధారాలు లేకుండా మాట్లాడను. నేను చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నాయి కనుకనే నేను ఆ ఆరోపణలు చేశాను. కనుక తెరాస సర్కార్ తో సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయడానికైనా నేను సిద్దమే. వాళ్ళకు దమ్ముంటే నాపై కేసు పెత్తవచ్చు. అప్పుడు నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ను, రాష్ట్ర డిజిపిని అందరినీ బోనులో నిలబెట్టించడం ఖాయం. 

ఒకవైపు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశ చూపుతూ మరోపక్క ప్రభుత్వమే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు వెళ్ళే విధంగా ప్రేరేపించడం, ఆనక వారిని తామే కనుగొన్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందించడం చాల హేయమైన చర్య. కొన్ని రోజుల క్రితం డిల్లీలో జరిగిన ఒక జాతీయ స్థాయి అంతర్గత భద్రతా సమావేశంలో తెలంగాణా పోలీస్ శాఖ నకిలీ వెబ్ సైట్ ప్రస్తావన వచ్చింది.

నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. తెరాస సర్కార్ నాపై చర్యలు తీసుకోదలిస్తే వారిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. దీనితో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి సంబంధం లేదు. ఆ ఆరోపణలు నేనే చేశాను కనుక వాటికి నేనే భాద్యత వహిస్తున్నాను,” అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.