ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో విదేశీ నిర్మాణ సంస్థల చేత నిర్మింపజేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ పద్దతికి మొగ్గు చూపడానికి ఆయన గట్టిగా సమర్ధించుకొన్నారు. కానీ ఆ తరువాత ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ ఆలోచన మానుకొన్నట్లున్నారు. ఒకవేళ అదే పద్దతిలో ముందుకు వెళ్ళి ఉండి ఉంటే ఏమైఉండేదో అర్ధం చేసుకొనేందుకు మన కాళ్ళ ముందు ఒక చిన్న ఉదాహరణ కనిపిస్తోంది. అదే..రాష్ట్ర ప్రభుత్వానికి, జపాన్ కంపెనీ ‘మాకి’ మద్య మొదలైన న్యాయవివాదం.
మాకి సంస్థ అమరావతిలో భవనాల డిజైన్లు గీసి ఇచ్చింది. అయితే అవి విద్యుత్ ప్లాంట్ల చిమ్నీల మాదిరిగా ఉన్నాయని విమర్శలు రావడంతో ప్రభుత్వం ‘మాకి’ కంపెనీని దాని డిజైన్లను పక్కన పడేసింది. వాటి కోసం మాకి కంపెనీకి చెల్లించిన సొమ్ము అన్నీ వృధా అయిపోయాయి. అది వేరే విషయం. తమ డిజైన్లను తిరస్కరించడంతో మాకి కంపెనీ చైర్మన్ పుమిహికో సహజంగానే ఆగ్రహం చెందారు. ఒక కార్యక్రమంలో ఏపి సర్కార్ పని తీరు పరమ అధ్వానంగా ఉంటుందని..దాని పనులలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉటుందని అన్నారు. ఆయన ఇంకా చాలా విమర్శలు చేశారు. అవన్నీ అప్రస్తుతం.
ఆయన వ్యాఖ్యలు తమ ప్రభుత్వాన్ని కించపరిచి ప్రతిష్టను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఏపి సర్కార్ మాకి చైర్మన్ పుమిహికో లీగల్ నోటీసు పంపించింది. దానికి ఆయన ఏదోవిధంగా స్పందించవచ్చు. అది కూడా అప్రస్తుతమే.
డిజైన్ల విషయంలోనే ఇంత రాద్దాంతం జరుగుతున్నప్పుడు, విదేశీ కంపెనీలతో స్విస్ ఛాలెంజ్ విధానంలో దశాబ్దాల తరబడి సాగే రాజధాని నిర్మాణంలో ఎన్ని వివాదాలు తలెత్తుతాయో, వాటితో వివాదాలు ఏర్పడితే వాటి పరిష్కారం ఎంత కష్టమో..ఈ చిన్న సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మించి చూపి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోయేలా చేస్తానని చంద్రబాబు చెప్పేవారు. ఆవిధంగా కాకపోయినా, ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవినీతి, రాజకీయ పక్షపాతం గురించి పుమిహికో చేసిన వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువుపోగొట్టుకొన్నట్లు అయింది. కనుక ఏపి సర్కార్ దీనిని ఒక గుణపాఠంగా స్వీకరించి, ఇకనైనా భారతీయ సంస్థలకే పనులు అప్పగించి రాజధాని నిర్మించుకోవడం మంచిదేమో.