మిర్చి రైతులకు మద్దతుగా నేడు తెదేపా, వామపక్షాలు ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి. అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూసివేసి మిర్చి రైతులకు మద్దతుగా ఈ బంద్ కు మద్దతు తెలుపాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. మిర్చి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు నిరసిస్తున్నాయి. మిర్చి రైతులను వ్యాపారులు దోచుకొంటున్నా మద్దతుధర నిర్ణయించడం కేంద్రం పరిధిలో అంశం అని చెప్పి తెరాస సర్కార్ తప్పించుకోవడం సరికాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వమె మిర్చిని కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి ఘటనలో అరెస్టయిన మిర్చి రైతుల కుటుంబాలను తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిన్న పరామర్శించి, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.