తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చారో లేక పార్టీ కార్యాలయానికి తాళం వేయడానికే వచ్చారో తెలియడం లేదు. అయన తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖపై చాలా తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు ట్వీటర్ లో పోస్ట్ చేశారు.
“తెలంగాణా పోలీస్ శాఖ స్వయంగా ఒక బోగస్ ఐసిస్ వెబ్ సైట్ సృష్టించింది. దాని ద్వారా రాష్ట్రంలోని ముస్లిం యువతను ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి ప్రేరేపిస్తోంది,” అని ట్వీట్ చేశారు.
దీనిపై ఐటి మంత్రి కేటిఆర్ వెంటనే చాలా ఘాటుగా స్పందించారు.
“ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చాలా బాధ్యతారాహిత్యంగా ఖండించ తగ్గ విమర్శలు చేశారు. ఆయన వాటిని తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలి లేదా తన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలి,” అని ట్వీట్ చేశారు.
అపార రాజకీయ అనుభవజ్ఞుడు దిగ్విజయ్ సింగ్ ఈవిధంగా ఎందుకు ట్వీట్ జారారో గానీ అడ్డంగా దొరికిపోయారు. ఆయన చేసిన ఈ అనుచిత ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వాన్నే శంకిస్తున్నట్లుగా, అవమానించేవిధంగా ఉన్నాయి.
మంత్రి కేటిఆర్ చెప్పినట్లు ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఏ వ్యక్తి ఇంత నీచమైన ఆరోపణలు చేయరు. కానీ దిగ్విజయ్ సింగ్ చేశారు. అయన వయసు పెరుగుతున్న కొద్దీ పనితీరు, మాటతీరులో కూడా తేడాలు వస్తున్నాయి. అదే కారణం చేత ఆయనను ఈమద్యనే కర్నాటక, గోవా రాష్ట్రాల బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే, వయసు మీద పడిన దిగ్విజయ్ సింగ్ ఈవిధంగా మాట్లాడుతూ వారికి, పార్టీకి కూడా తీరని నష్టం కలిగిస్తున్నారు. కనుక ఆ వ్యాఖ్యలతో బాటు ఆయనను కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకొంటే మంచిదేమో?