ఈపని ముందే చేసి ఉంటే..

ఖమ్మం మిర్చి యార్డు కార్యాలయంపై మిర్చిరైతుల దాడి, దాని పర్యవసానాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే రాష్ట్ర సాగునీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని మిర్చి రైతుల సమస్య పరిష్కారానికి పూనుకోవడం అభినందనీయం. ఆయన మార్కట్ యార్డ్ చైర్మన్, జిల్లా కలెక్టరుతో మాట్లాడి తక్షణం మిర్చి కొనుగోళ్ళకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒకేసారి బారీగా తరలివచ్చిన మిర్చిని కాటా వేసేందుకు కాటాలు లేవని తెలిసి, ఇరుగుపొరుగు జిల్లాలలో మార్కెట్ యార్డుల నుంచి, వ్యాపారులు, కోల్డ్ స్టోరేజిల నుంచి కాటాలు రప్పించారు.  

హరీష్ రావు ఆదేశాల మేరకు మార్కట్ యార్డ్ చైర్మన్ కృష్ణ, ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఆర్డీవో పూర్ణచంద్రరావు, తహసీల్దార్‌ శ్రీలత తదితరులు వ్యాపారులతో, మిర్చి రైతులతో మాట్లాడి కొనుగోళ్ళు మొదలయ్యేలాగ చేయగలిగారు. నాణ్యమైన మిర్చికి క్వింటాలుకి రూ.5,600, రెండవ గ్రేడ్ మిర్చికి రూ.3,200 చొప్పున ధరలు నిర్ణయించి శని, ఆదివారాలలో మార్కెట్ కు శలవు అయినప్పటికీ కొనుగోళ్ళు జరిపించారు. ముందుగా మార్కెట్ యార్డు చుట్టుపక్కల ఆరుబయట రోడ్ల పక్కన పేరుకుపోయిన మిర్చి నిలువలను కొనుగోలు చేశారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు వచ్చిన సరుకు అంతా కొనుగోలు చేసి తరలించినట్లు తెలుస్తోంది. ఖమ్మం మార్కెట్ యార్డ్ లోపల 30,000 బస్తాల మిర్చి ఇంకా ఉంది. ఈరోజు నుంచి రోజూ ఎంత మిర్చి వచ్చినా సరే వెంటనే కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 

మిర్చి కొనుగోళ్ళు మొదలుపెట్టడం చాలా సంతోషించవలసిన విషయమే. ఇదే పని 10 రోజుల క్రితమే చేసి ఉండి ఉంటే మిర్చి రైతులు సంతోషించి ఉండేవారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చి ఉండేది కాదు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం దక్కేది కాదు కదా! ఏమైనప్పటికీ రెండవ గ్రేడ్ మిర్చికి రూ.3200 మాత్రమే చెల్లించడం చూస్తే చివరకు వ్యాపారుల మాటే నెగ్గిందని అర్ధం అవుతోంది. ఆ ధరకు కూలీలకు, ఎరువులకు పెట్టిన ఖర్చులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, తప్పనిసరి పరిస్థితులలో ఆ ధరకే అమ్ముకొని ఇళ్ళకు తిరిగివెళ్ళవలసి వస్తోంది. మిర్చి కొనుగోళ్ళు మొదలైనందుకు సంతోషించాలా లేక రైతులకు గిట్టుబాటు ధరలు రానందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.