వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజులు గుంటూరులోని నల్లపాడువద్ద ‘రైతు దీక్ష’ చేయబోతున్నారు. పంట రుణాల హామీ అమలు చేయనందుకు, రాష్ట్రంలో రైతులను తెదేపా ప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా జగన్ ఈ దీక్ష చేపడుతున్నారు.
“ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం దేనికి? వాటితో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుచేయకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేయడం దేనికి? హామీలు అమలుచేయగలిగే మాటయితేనే ఇవ్వాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తామంటే మేము చూస్తూ ఊరుకోము,” అన్నారు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి.
ఏపి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ దీక్షపై స్పందిస్తూ, “రైతు వ్యతిరేకి అని ముద్రపడిన జగన్ కు వారి సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. 2014 ఎన్నికలలో మేము రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తే దానిని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. రైతులను రెచ్చగొట్టేందుకే జగన్ ఈ దీక్ష చేస్తున్నారు. రాయలసీమకు నీళ్ళు అందించడానికి మేము ప్రయత్నించినప్పుడు, రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నప్పుడు కూడా జగన్ ఇలాగే అవరోధాలు సృష్టించారు. కానీ వాటిని మేము అధిగమించి ముందుకు సాగుతున్నాము. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతుల కోసం దీక్ష చేపట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.