6.jpg)
భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం కోసం నిన్న ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర శాసనసభ కేవలం 10 నిమిషాలలో, మండలి కేవలం 5 నిమిషాలలో వాటిని ఆమోదించేసి ముగించేయడం విశేషమే. రాష్ట్రంలో రైతుల జీవితాలను తీవ్ర ప్రభావితం చేయబోయే, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్ ను నిర్దేశించే ఈ చట్టసవరణలపై ఉభయసభలలో చర్చించకుండానే ప్రతిపక్షాల నిరసనల మద్య వాటిని ఆమోదించడం, వెంటనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయడం చాలా విచిత్రంగానే ఉంది. అతిముఖ్యమైన ఈ అంశంపై ప్రభుత్వం సభలో చర్చించడానికి ఎందుకు వెనుకాడింది?
తెరాస సర్కార్ చాలా నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే తెరాస సర్కార్ బలవంతంగా రైతుల భూములను గుంజుకొనేందుకే ఈ సవరణలను చేసిందని, దానిపై సభలో లోతుగా చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే తెరాస సర్కార్ దానిపై చర్చ లేకుండా ఆమోదించి ఉభయసభలను వాయిదా వేసిందని కాంగ్రెస్, భాజపా నేతలు తీవ్రంగా విమర్శించారు. ఏమైనప్పటికీ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బిల్లును సభలో ప్రవేశపెట్టడం, దానిని ఆమోదించడం, సభలను వాయిదా వేయడం దేశంలో సరికొత్త రికార్డే. కనుక ఆవిధంగా చూసినా ఈ ప్రత్యేకసమావేశాలు చాలా ప్రత్యేకమైనవే అని చెప్పక తప్పదు.