అది రాజకీయ కుట్రే: కేసీఆర్

“ఖమ్మం మిర్చియార్డ్ కార్యాలయంపై మొన్న జరిగిన దాడి ఖచ్చితంగా కుట్రే. రాజకీయ దురుదేశ్యంతోనే ఆ విద్వంసం జరిగింది. రైతుల పేరిట కొందరు వ్యక్తులు మొహాలకు ముసుగులు ధరించి కార్యాలయాన్ని ద్వంసం చేశారు. దీనిపై విచారణ జరిపిస్తున్నాము. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా విడిచిపెట్టబోము. అందరిపై కేసులు పెడతాము,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

ఈ సంఘటనపై మొదటగా మాట్లాడిన తెరాస నేతలు కర్నే ప్రభాకర్, గట్టు రామచంద్రారెడ్డి ఇద్దరూ ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్నే చెప్పారని అర్ధం అవుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఖమ్మం దాడి తెదేపా, కాంగ్రెస్ ముఠాల పనే అని అన్నారు. సిసి టీవీలలో రికార్డ్ అయిన చిత్రాలను గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ విద్వంసంలో పాల్గొన్నది నిజంగా రైతులే అయితే వారి కాళ్ళకు దణ్ణం పెడతానని తుమ్మల అన్నారు.

 పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలకు మద్దతు ధర నిర్ణయించేది కేంద్రప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కావనే సంగతి కాంగ్రెస్ నేతలకు తెలిసిఉన్నా తెలియనట్లుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయంలో ఏనాడు రైతులకు మేలు చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెరాస సర్కార్ మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే, ఓర్వలేక ఇటువంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారని తుమ్మల విమర్శించారు.    

ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను 'సన్నాసులు..దద్దమ్మలు' అని అంటే తుమ్మల కాంగ్రెస్ నేతలను 'లఫంగాలు, లుచ్చాలు' అనడం విశేషం. భూసేకరణ చట్టానికి సవరణలు చేయడానికి తొందర లేదని వాదిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అసలు రాజకీయ నాయకుడేనా లేక మూర్ఖుడా? అని మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిర్చి రైతుల ఆవేదన ఆగ్రహంగా మారి అది కట్టలు తెంచుకొని ఈ విద్వంసానికి దారి తీసిందని కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అది ప్రతిపక్షాల కుట్ర అని వాదించడం చాలా శోచనీయం. ఒకవేళ వారు చెపుతున్నట్లు నిజంగా అది ప్రతిపక్షాల కుట్రే అయితే తప్పకుండా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవలసిందే. కానీ మిర్చి రైతులు మిర్చి ధరలు పతనం అయినందుకు వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుండటం ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతూనే ఉంది.

వారి కష్టాలను, ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకొని వారికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారందరూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే..ద్రోహులే..వారిపై కేసులు పెడతాము..కటినమైన చర్యలు తీసుకొంటాము అని స్వయంగా ముఖ్యమంత్రే బెదిరించడం చాలా శోచనీయం. ఆవిధంగా తాత్కాలికంగా వారి గొంతునొక్కవచ్చేమో కానీ వారి కష్టాలు తీరవు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి రైతులు బాధపడకుండా ఉండరు. దాని వలన తెరాసకే నష్టం కలిగే అవకాశం ఉంటుందని గ్రహిస్తే మంచిది.

మిర్చికి మద్దతు ధర ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనప్పుడు, రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచిస్తే బాగుంటుంది. వారం రోజుల వ్యవధిలో గులాబీ కూలి చేసి కోట్లు రూపాయలు పోగేసి, లక్షల మందితో నభూతో నభవిష్యత్ అన్నట్లు అట్టహాసంగా వరంగల్ సభని నిర్వహించగలిగిన తెరాస సర్కార్, దాని మంత్రులు, నేతలు మిర్చి రైతుల కోసం ఏమి చేయలేరా? అనే సందేహం కలుగుతుంది.