ఆదివారం శాసనసభ ప్రత్యేక సమావేశం

రాష్ట్ర శాసనసభా వ్యవహారాల సంఘం ఈరోజు సమావేశమయ్యింది. రేపు అంటే ఆదివారం ఒక్కరోజే శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. రేపటి సమావేశంలో కేవలం భూసేకరణ బిల్లు సవరణలపై చర్చించి ఆమోదించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆ సవరణల తాలూకు కాపీలను సభ ఆరంభం అవడానికి ఒక్క గంట ముందుగా సభ్యులకు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు జరిగిన సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి, పాషాఖాద్రి హాజరయ్యారు. 

రేపటి శాసనసభ సమావేశానికి తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది చూడాలి. శాసనసభలో కాంగ్రెస్, భాజపా సభ్యులు రేపు మిర్చి రైతుల సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ‘సన్నాసులు..దద్దమ్మలు’ అని అన్నందుకు వారు ఆయనపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. కనుక రేపటి సభలో వారు కేసీఆర్, తెరాస సర్కార్ పై గట్టిగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. లేదా తమ నిరసన తెలియజేసేందుకు సభకు హాజరుకాకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ సభ్యులు హాజరయితే మాత్రం వారు చాలా తీవ్రస్థాయిలోనే తెరాస సర్కార్ తో యుద్ధం చేయవచ్చు. కనుక భూసేకరణ బిల్లుపై అర్ధవంతమైన చర్చ జరుగుతుందో లేదో అనుమానమే.