.jpg)
తెలంగాణా శ్రేయోభిలాషి, అపర భగీరధుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావు (78) శనివారం కన్నమూశారు. అయన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మూడు వారాల క్రితమే హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ నిన్న రాత్రి నుంచే పరిస్థితి విషమించి ఈరోజు కన్ను మూశారు.
విద్యాసాగర్ రావు నల్లగొండ జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో 1939లో జన్మించారు. ఆయనకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. వారిరువురూ డిల్లీలో స్థిరపడ్డారు. అయన 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ చేసి, 1979లో రూర్కీలోని జలవనరుల అభివృద్ధివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికాలోని కొలరోడో స్టేట్ యూనివర్సిటీలో డిప్లమా, 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. తరువాత కేంద్రజలసంఘంలో చాలా కాలం పనిచేశారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా కూడా పనిచేసిన గొప్ప అనుభవజ్ఞుడు.
సాగునీటి రంగానికి సంబంధించి పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాశారు. వాటినే నీళ్ళు-నిజాలు పేరిట ఒక పుస్తకంగా ప్రచురించారు. తెలంగాణా రాష్ట్రంలో సాగునీటి పరిస్థితికి అది అద్దం పడుతుంది. ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్ అయినప్పటికీ మంచి రచయిత, మంచి నటుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకొన్నారు.
దశాబ్దాలుగా తెలంగాణాకు నీటి పంపకాల విషయంలో ఏవిధంగా ఎంత అన్యాయం జరిగిందో వివరించడమే కాకుండా ఆ సమస్యలను చక్కదిద్దుకోవడానికి చక్కటి ప్రణాళికలు కూడా రూపొందించి ఇచ్చారు. సాగునీటి విషయంలో తెలంగాణా రాష్ట్ర పరిస్థితులపై లోతైన అవగాహన, ఆ రంగంలో ఆయనకున్న విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీటిని అందించాలనేది ఆయన సంకల్పమే. దాని కోసం ముమ్ముర ప్రయత్నాలు జరుగుతుండగానే ఆయన కనుమూశారు.
అపర భగీరదుడిలా కృషి చేస్తున్న ఆయనను చూసి ఆ పరమేశ్వరుడు కూడా ముచ్చట పడ్డాడో ఏమో..మధ్యలోనే తన వద్దకు తీసుకుపోయాడు. ఆయన మరణంతో తెలంగాణా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం ఒక ఆత్మీయుడిని, శ్రేయోభిలాషిని కోల్పోయారని చెప్పక తప్పదు. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.