విశాఖలో వోల్వో బస్సు దగ్ధం!

గాలిలో తేలిపోతున్నట్లు సాగిపోయే వోల్వో బస్సు ఎక్కితే..ప్రయాణికులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి.1. హాయిగా టీవీలో సినిమా చూస్తూ నిద్రపోవడం. 2. నిద్రపోకుండా మేల్కొని ఉండటం. మొదటి ఆప్షన్ ఎంచుకొన్నవారు అదృష్టం బాగుంటే గమ్యం చేరుకొంటారు.. లేకుంటే ఈ భూమ్మీద అదే చివరి యాత్ర కావచ్చు. రెండవ ఆప్షన్ ఎంచుకొన్నవారు గమ్యం చేరుకొన్నా చేరుకోలేకపోయినా గ్యారెంటీగా ప్రాణాలతో బస్సు దిగుతారు. ఈ రెండు ఆప్షన్లు ఎందుకంటే, వోల్వో బస్సులలో ఎప్పుడు మంటలు చెలరేగుతాయో తెలియదు కనుక.      

హైదరాబాద్ నుంచి అనకాపల్లికి కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బసులో బయలుదేరిన ఒక పెళ్ళి బృందానికి ఇంకా భూమీద నూకలు మిగిలి ఉండటంతో ఆఖరి నిమిషంలో అందరూ బస్సులో నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకొన్నారు. 

ఈరోజు తెల్లవారు జామున విశాఖజిల్లా కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్దకు చేరుకొనేసరికి బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు వస్తున్నట్లు కొందరు ప్రయాణికులు గుర్తించి, డ్రైవరును అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపివేశాడు. వెంటనే బస్సులో 50 మంది ప్రయాణికులు దిగిపోయారు. వారు దిగిన కొన్ని నిమిషాలలోనే మంటలు వ్యాపించాయి. వారి కళ్ళ ముందే బస్సు దగ్ధం అయిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు కానీ పెళ్ళి బృందానికి సంబంధించిన విలువైన బట్టలు, వస్తువులు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకొన్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే బస్సు సగంపైగా కాలిపోయింది.