ఖమ్మంలో సెక్షన్ 144 విధింపు!

నిన్న ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్ కార్యాలయం విద్వంసం తరువాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంది. రైతులు భయపడినట్లే ఈరోజు ఉదయం ఖమ్మంలో కొంత సేపు వాన కురిసింది. దానితో రోడ్ల పక్కన, యార్డులో బయట నిలువ ఉంచిన మిర్చి బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే మిర్చి ధర పడిపోయినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న మిర్చి రైతులు వానకు తడిసిపోయిన మిర్చి బస్తాలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు ఆధ్వర్యంలో ఈరోజు రైతులు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ ఆందోళన కార్యక్రమానికి తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, వామపక్షాల నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా హాజరవుతారని సమాచారం. కనుక మళ్ళీ ఎటువంటి అవాంచనీయ ఉన్నందున సంఘటనలు జరుగకుండా ఖమ్మంలో సెక్షన్ 144 విధించినట్లు పోలీసులు ప్రకటించారు.       

ఇక నిన్న జరిగిన విద్వంసం వెనుక తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హస్తం ఉందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపినట్లు సమాచారం. నిన్న జరిగిన విద్వంసకర సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిలో ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హస్తం ఉందని తెరాస నేతలు ఆరోపించిన తరువాతే ఆ దిశలో దర్యాప్తు మొదలవడం గమనిస్తే సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ ఖాయంగానే కనిపిస్తోంది. 

అధికార, ప్రతిపక్షాల ఈ రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. కానీ మిర్చి రైతుల సమస్యను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరిస్తే బాగుంటుంది. తక్షణమే మిర్చి కొనుగోళ్ళు మొదలుపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ అధికారులు వ్యాపారులతో, రైతులతో మాట్లాడుతున్నారు.