పాలకుర్తి అభివృద్ధికి రూ.170 కోట్లు మంజూరు

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర, రాఘవాపూర్ గ్రామాల పర్యటన పర్యటన సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.170 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  

బమ్మెర గ్రామంలో గల మహాకవి బమ్మెర పోతన సమాధిని దర్శించుకొన్న తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తికి అనేక వరాలు ప్రకటించారు. గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.50 కోట్లు, పిఆర్ రోడ్ల కోసం రూ.50 కోట్లు, పాలకుర్తి నుండి నాంచారి మాడూరు రోడ్డు నిర్మాణానికి రూ. 30 కోట్లు, బమ్మెర పోతన సమాధి ప్రాంతం అంతా అభివృద్ధికి రూ.7.5 కోట్లు, జిల్లాలోని ఒక్కో మండల కేంద్రం అభివృద్ధికి కోటి రూపాయలు చొప్పున మంజూరు చేస్తానని ప్రకటించారు. 

అలాగే పాలకుర్తికి రూ. 6 కోట్లు, వల్మిడికి రూ.5 కోట్లు, జాఫర్ ఘడ్ కు రూ.6 కోట్లు, ఖిలాషాపురంకు రూ.4.5  కోట్లు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. మహాకవి పోతన సమాధి పక్కగా సాగే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం శనివారమే జివో జారీ చేస్తానని హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యే దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేశారు. రాఘవాపూర్ గ్రామంలో 45 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి కేసీఆర్ శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అదనంగా మరో 30 ఇళ్ళను మంజూరు చేశారు. రాఘవాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పధకం పూర్తవడంతో ఇంటింటికీ మంచినీళ్ళ సరఫరాను ప్రారంభించారు. 

పాలకుర్తిలో మహిళా రెసిడెన్షియల్ కళాశాల, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనే విజ్ఞాప్తులపై కేసీఆర్ స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. అలాగే పాలకుర్తిలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వలన నియోజకవర్గానికి చాలా మేలే జరిగింది.