విద్యన్న ఆరోగ్యం ఆందోళనకరం?

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు ఆరోగ్యపరిస్థితి ఇంకా క్షీణించినట్లు తాజా సమాచారం. ఆయన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దానికి వైద్యం చేయించుకొనేందుకు గత ఏడాది ఆయన అమెరికా వెళ్ళి వచ్చారు. మూడు వారాల క్రితం మళ్ళీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అప్పటి నుండి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఒక ఆప్తమిత్రుడిగా చాలా అభిమానిస్తారు. కనుక మూడు రోజుల క్రితమే కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళి ఆయనను పరామర్శించివచ్చారు. కానీ ఆయన ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కేసీఆర్ ‘విద్యన్న..విద్యన్న..నేనే.. కేసీఆర్ వచ్చినా” అని పిలిచినప్పటికీ ఆయన కళ్ళు విప్పి చూడలేకపోయారు. ఇంతకాలం తనకు కుడిభుజంలా మెలిగిన ఆయనను ఆ పరిస్థితిలో చూసి కేసీఆర్ చలించిపోయారు. కానీ చేసేదేమీలేక వెనుతిరిగారు. తాజా సమాచారం ప్రకారం విద్యాసాగర్ రావు ఆరోగ్యం మరికాస్త విషమించినట్లు తెలుస్తోంది. కానీ వైద్యులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కి విద్యాసాగర్ రావు మార్గదర్శిగా నిలుస్తుండేవారు. నిజానికి వారిరువురు తెలంగాణా ఉద్యమ సమయంలోనే సాగునీటి విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి, తెలంగాణా ఏర్పడితే దానిని ఏవిధంగా సరిదిద్దాలనే విషయాల గురించి సుదీర్గంగా చర్చించుకొనేవారు. వారు కోరుకొన్నట్లుగానే తెలంగాణా ఏర్పడటంతో ఇరువురు కలిసి తమ సాగునీటి మహాయజ్ఞం ప్రారంభించారు. తమ ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తుంనందుకు విద్యాసాగర్ రావు చాలా బాధపడేవారని ఆయన సన్నిహితులు చెపుతుంటారు. తెలంగాణా ఏర్పడినప్పటికీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన చెందేవారని సన్నిహితులు చెపుతుంటారు. తెలంగాణా కోసం..రైతుల కోసం..వారి పంటల కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ వారికి సాగునీటిని అందించి బంగారి తెలంగాణా చూడాలని కలలు కన్న విద్యాసాగర్ రావు మళ్ళీ కోలుకొని రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకొందాము.