అధికారంలో ఉన్నవారికి అడగకుండానే అందరూ సన్మానిస్తుంటారు కానీ ఎప్పుడో ఏళ్ళ క్రితం చేసిన పనికి ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతను ప్రజలు సన్మానించడం విశేషమే కదా! హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలోని ప్రజలు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఘనంగా సన్మానం చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేసి వేల ఎకరాలకు సాగునీరు అందించినందుకు కృతజ్ఞతగా వారు ఆయనను బాజాబజంత్రీలతో ఊరేగించి తీసుకువచ్చి స్థానిక ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ “ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎత్తిపోతల పధకాన్ని పూర్తిచేసి వేలాది ఎకరాలకు నీళ్ళు అందించాను. కానీ తెరాస సర్కార్ అసలు ఏమీ చేయకుండానే చాలా చేసేశామని గొప్పలు చెప్పుకొంటోంది. ఈనాడు తెరాస సర్కార్ చెప్పుకొంటున్న మిషన్ భగీరథ నేను ఎప్పుడో ఆనాడే చేసి చూపాను,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. “కేసీఆర్ తను ఒక్కడే తెలంగాణా సాధించానని అనుకొంటారు. తెలంగాణా ఉద్యమాలలో, సాధనలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను కేసీఆర్ విస్మరించారు. తన పట్ల వారికి తీవ్రవ్యతిరేకత ఉందనే భయంతోనే శతాబ్ది ఉత్సవాలలో కనీసం మాట్లాడే సాహసం కూడా చేయలేకపోయారు. వరంగల్ లో మాత్రం తన తెరాస కార్యకర్తలను కూర్చోబెట్టుకొని రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి తాను ఏదో గొప్పగా చేసేస్తున్నట్లు ఉపన్యాసం దంచారు. కానీ దాని వలన ఎవరికీ ఒరిగేదేమీ ఉండదు.
తెరాస నేతల గులాబీ కూలికి లక్షల రూపాయలు..మిర్చి, కంది రైతులకు కనీసం మద్దతుధర కూడా లేదా? మిర్చి, కంది రైతులను ఆదుకోలేని మంత్రులు గులాబీ కూలి పేరుతో వరంగల్ సభ కోసం లక్షల రూపాయాలు నిసిగ్గుగా పోగేశారు. ప్రభుత్వం తీరుపట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాసను గద్దె దింపి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడం ఖాయం,” అని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.