మా సమస్యని సర్కారే పరిష్కరించాలి

రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు వీలుకల్పిస్తూ తెలంగాణా ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 26న జారీచేసిన జీవో: 16ను హైకోర్టు మొన్న కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆ జీవో జారీ చేసినప్పుడు, ఇక తమ జీవితాలలో వెలుగులు నిండుతాయని, తాము కూడా ఇతర ప్రభుత్వోద్యోగులు మాదిరిగానే ఆర్ధిక సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చని ఎంతో ఆశపడిన వేలాదిమంది కాంట్రాక్ ఉద్యోగులు హైకోర్టు తీర్పు విని తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు.ఈ తీర్పు తమ నోటికాడ కూడుని లాగేసిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం జారీ చేసిన జీవో:16 అమలయ్యి ఉండి ఉంటే 1996 నుంచి 2016 వరకు పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ది కలిగి ఉండేది. వారిలో వేలాదిమంది గత 20-30 ఏళ్ళుగా చేస్తున్నవారున్నారు. తాత్కాలిక ఉద్యోగులలో 30-40 సం.ల వయసున్నవారు వేలమంది ఉన్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. వారు ప్రభుత్వానికి అందించిన సేవలను, వారి దుస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉంచుకొని వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించేందుకు పూనుకొన్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయం వలన తాము నష్టపోతామని ఉస్మానియా విద్యార్ధులు పిటిషన్ వేయడంతో హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో:16ను కొట్టివేసింది. 

కనుక ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కనీసం 20 ఏళ్ళు సర్వీస్ చేసిన వారికైనా క్రమబద్దీకరించడానికి వీలుగా ప్రభుత్వం మళ్ళీ విధివిధానాలు రూపొందించాలని ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర కార్యదర్శి రత్నకుమార్ అభ్యర్ధించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు కూడా సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఆ సమస్యను కూడా ప్రభుత్వం ఇంకా పరిష్కరించవలసి ఉంది. ఇప్పుడు దానికి ఈ సమస్య కూడా తోడైంది.