ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ‘సన్నాసులు, దద్దమ్మలు, అసమర్ధులు, అవినీతిపరులు’ అంటూ ఎన్ని తిట్లు తిట్టినా వారు కనుక నడుం బిగించి రంగంలోకి దిగితే ఏవిధంగా ఉంటుందో తమ తడాఖా చూపిస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ మహిళా నేతలు కింగ్ కోటి, పేట్ల బుర్జు ప్రసూతి ఆసుపత్రులను సందర్శించి అక్కడ సిజేరియన్ ఆపరేషన్ జరిగిన బాలింతలు ఎందుకు మరణిస్తున్నారో కారణాలు అడిగి తెలుసుకొన్నాక, ఈ సంఘటనల గురించి మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేసి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. వారి పిర్యాదును స్వీకరించిన కమీషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధన కార్యదర్శి ఎస్.పి. సింగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారికి నోటీసులు పంపించింది. ప్రభుత్వాసుపత్రులలో బాలింతలు ఎందుకు మరణిస్తున్నారో ఆగస్ట్ 3లోగా కారణాలు తెలియజేయాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంలో మహిళా కాంగ్రెస్ నేతలు బాగానే స్పందించారు...బాగానే వ్యవహరించారు. కానీ ఆసుపత్రులలో బాలింతలు వరుసగా మరణిస్తున్నారని వారు మానవహక్కుల కమీషన్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు, కమీషన్ తక్షణమే దానిని నివారించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఆగస్ట్ 3లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి నోటీసు పంపించి చేతులు దులుపుకోవడం శోచనీయం.
ఆగస్ట్ 3వరకు అంటే మరో 3 నెలలలోగా ఇంకా ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోతారో..అ కారణంగా ఇంకా ఎంతమంది శిశువులు పుట్టుకతోనే తల్లులకు దూరం అవుతారో..ఎన్ని కుటుంబాల ఇంటి దీపాలు ఆరిపోతాయో ఎవరికీ తెలియదు. కనుక మానవహక్కుల కమీషన్ నోటీస్ సంగతి పక్కనబెట్టి ప్రభుత్వం తక్షణం ఈ సమస్యకు మూలకారణం ఏమిటో తెలుసుకొని దానిని పరిష్కరించడం చాల అవసరం. లేకుంటే ఇదీ ప్రభుత్వానికి ఒక మచ్చగా మిగిలిపోతుంది.