“కేసీఆర్..జిందాబాద్.. ముఖ్యమంత్రి జిందాబాద్..” తూచ్! “కేసీఆర్ డౌన్ డౌన్..ముఖ్యమంత్రి..డౌన్ డౌన్” ఈ సంఘటన మహిళా కాంగ్రెస్ నేతల ఊరేగింపులో జరిగింది.
ప్రభుత్వాసుపత్రులలో బాలింతల మరణాలపై మానవహక్కుల సంఘానికి పిర్యాదు చేయడానికి వారు హైదరాబాద్ లో ఈరోజు ఊరేగింపుగా బయలుదేరినప్పుడు, ముందు నడుస్తున్న మహిళా కాంగ్రెస్ నేత ‘కేసీఆర్’ అని అనగానే వెనుకనున్న వారు ‘జిందాబాద్’ అని నినాదాలు చేశారు. మళ్ళీ ఆమె ‘ముఖ్యమంత్రి’ అనగానే మళ్ళీ వెనుకనున్నవారందరూ మళ్ళీ ‘జిందాబాద్’ అని గట్టిగా నినాదాలు చేశారు. అంతలో పక్కనున్న మరో మహిళా కాంగ్రెస్ నేత హెచ్చరించడంతో ముందు నడుస్తున్న మహిళా నేత ‘కేసీఆర్ డౌన్ డౌన్’ అని చెప్పిన తరువాత ‘కేసీఆర్’ అన్నప్పుడు వెనుకనున్నవారు కూడా సర్దుకొని ఈసారి ‘డౌన్ డౌన్’ అని నినాదాలు చేశారు.
ఈ సంఘటన అందరికీ నవ్వు తెప్పించినప్పటికీ కేసీఆర్ పట్ల ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో ఇది అద్దం పడుతోంది. ఆయన పేరు చెప్పగానే వారి నోట అప్రయత్నంగా ‘జిందాబాద్’ అని వచ్చిందంటే అయన పాలనను మెచ్చుకొంటున్నట్లే కదా? మహిళా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాసుపత్రులు సందర్శించి తెరాస సర్కార్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించినప్పటికీ, చివరకు వారు కూడా అప్రయత్నంగా ముఖ్యమంత్రి జేజేలు పలుకడం విశేషమే కదా!