తెరాస 16వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో ప్రకాష్ రెడ్డి పేటలో నేటి సాయంత్రం ‘ప్రగతి నివేదన సభ’ పేరిట తెరాస బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. సభ పేరును చూస్తేనే ఈ బహిరంగ సభలో తెరాస ఏమి చెప్పబోతోందో అర్ధం అవుతుంది. తెరాస అధికారంలోకి రాక మునుపు పరిస్థితులు, ఈ మూడేళ్ళలో తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా చెప్పుకొని, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని వరాలు ప్రకటించి మళ్ళీ తమకే ఓట్లు వేసి గెలిపించాలని తెరాస కోరవచ్చు.
సుమారు 15 లక్షల మంది జనసమీకరణ చేసి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సభను నిర్వహించి రాష్ట్రంలోని ప్రజలందరూ తమవైపే ఉన్నారని చాటి చెప్పుకోవడం ఈ సభ మరో ముఖ్యోదేశ్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు అందరూ తెరాస పాలనతో చాల సంతోషంగా ఉన్నారనే బలమైన సంకేతాలు పంపేందుకు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బారీ సంఖ్యలో రైతులను గులాబీ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల నుంచి వందల కొద్దీ ట్రాక్టర్లలో రైతులను, ప్రజలను ఈ సభకు తరలిస్తుండటంతో ఎక్కడ చూసినా వారి హడావుడే కనిపిస్తోంది.
చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గులాబీ నివేదన సభకు ఆ రేంజ్ లోనే ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 1643 ఎకరాలలో 9 పార్కింగ్ జోన్లను ఏర్పటు చేశారు. 275 ఎకరాలలో సభా ప్రాంగణం, 8400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏకంగా 500 మంది కూర్చొనేందుకు సరిపడే బారీ వేదికను ఏర్పాటు చేశారు. వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు ఫ్యానులు, ఏసీలు ఏర్పాటు చేశారు. సభకు వస్తున్న ప్రజలకు అందించేందుకు 20 లక్షల చల్లటి మంచి నీళ్ళ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేస్తున్నారు.
ఇక సభ జరిగే పరిసర ప్రాంతాలలో కొత్తగా 20 బోర్లు వేశారు. వాటి నుండి నీటిని తరలించేందుకు 200 నీళ్ళ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాత్కాలిక మరుగు దొడ్లు నిర్మించారు. ఆరు ప్రాధమిక చికిత్సా కేంద్రాలను ఒక ప్రత్యేక ఐసియును కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంతానికి సులువుగా చేరుకొనేందుకు కొత్తగా రోడ్లు, వీధి దీపాలు వేశారు. తెరాస జెండాలు, బ్యానర్లతో వరంగల్ నగరం అంత గులాబీ రంగు అలుముకొంది. ఈ సభ గురువారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.