తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ (వ్రేలాడే వంతెన)కి నేడే మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహాన్ కలిసి శంఖుస్థాపన చేయబోతున్నారు. హైదరాబాద్ లో ఐ ల్యాబ్స్ జంక్షన్ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ మీదుగా జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు కలుపుతూ దీనిని నిర్మిస్తారు. జూబ్లీ హిల్స్ నుంచి హై టెక్ సిటీ, మాదాపూర్ వెళ్ళేవారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
రూ.184 కోట్లు వ్యయంతో నిర్మించబోయే ఈ కేబిల్ బ్రిడ్జ్ పొడవు సుమారు 365.85 మీ. ఉంటుంది. అప్రోచ్ రోడ్డుతో కలిపి మొత్తం 1,048 మీ. ఉంటుంది. నాలుగు లైన్లతో నిర్మిస్తారు కనుక బ్రిడ్జిపై ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
దీనికి మరింత శోభ కల్పించేందుకు దుర్గం చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించి ఆ ప్రాంతానంతా సుందరీకరణ చేయబోతున్నారు. దీని కోసం రూ. 50.80 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. దుర్గం చెరువు చుట్టూ సుమారు రెండున్నర కిమీ పొడవునా ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, అందమైన పార్కు, యోగా కేంద్రం వగైరాలన్నీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని నగరంలో మరొక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇక్కడే గణేష్ నిమజ్జనం కోసం వేరేగా ఒక పెద్ద కొలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సుందరీకరణ పనులు ఏడాది లోగానే పూర్తి కావచ్చు. కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రెండేళ్ళ సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు టెండర్లు పిలుస్తారు. వచ్చే నెల 25వ తేదీన టెండర్లను ఖరారు చేస్తారు. ఈ కాంట్రాక్టు దక్కించుకొన్న సంస్థ వెంటనే పనులు మొదలుపెట్టవలసి ఉంటుంది.