ఊహించినట్లే శశికళ మేనల్లుడు దినకరన్ ని డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అన్నాడిఎంకె పార్టీ రెండాకుల ఎన్నికల చిహ్నం దక్కించుకొనేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఒక బ్రోకరు ద్వారా 50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన స్నేహితుడు మల్లికార్జున్ కూడా ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. డిల్లీ పోలీసులు ఇదివరకే బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు నేడు వారిరువురినీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తారు. తరువాత వారికి రిమాండ్ పై జైలుకు పంపించడం, వారు బెయిలుకు దరఖాస్తు చేసుకోవడం వగైరా షరా మామూలుగా జరిగేవే.
పన్నీర్ సెల్వం, పళనిస్వామి మద్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. దినకరన్ అరెస్ట్ తరువాత ఇరువర్గాలు చేతులు కలిపి తదుపరి కార్యాచరణను అమలుచేయడానికి ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు దినకరన్ అరెస్ట్ అయ్యారు కనుక అతనిని, బెంగళూరు జైలులో ఉన్న శశికళను, వారి బంధువులను అందరినీ అన్నాడిఎంకె పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించవచ్చు. ఓపిఎస్-ఈపిఎస్ రాజీ ఒప్పందం ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. పన్నీర్ సెల్వానికి ఆర్ధిక మంత్రి పదవితోపాటు పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ఈరోజు వారు తీసుకొన్న నిర్ణయాల గురించి అన్నాడిఎంకె పార్టీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.