ముందస్తు ఎన్నికల ఊహాగానాల పుణ్యామాని రాష్ట్రంలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ముస్లిం రిజర్వేషన్ బిల్లు ఆమోదం, రాష్ట్రంలో రైతులకు ఎరువుల కోసం మొదట రూ.4,000, మళ్ళీ వారం రోజుల వ్యవధిలోనే అదనంగా మరో రూ.4000 ఇస్తామనే తెరాస సర్కార్ ప్రకటనతో మొదలైన ఈ ఎన్నికల హడావుడి, ప్లీనరీ సభతో మొదటి రౌండ్ ప్రచారం పూర్తి చేసుకొని మళ్ళీ 27న వరంగల్ సభతో రెండవ రౌండ్ కి సిద్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకేసారి రూ.2 లక్షలు పంట రుణాల మాఫీ, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం హామీలతో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల రేసులో భాజపా వెనుకబడినట్లు కనిపిస్తోంది. మోడీ నామస్మరణే సర్వరోగ నివారిణిగా భావిస్తూ, యూపిలో గెలిచాము కనుక తెలంగాణాలో కూడా గెలిచేయగలమనే భ్రమలో రాష్ట్ర భాజపా నేతలు కాలక్షేపం చేస్తున్నారు.
ఈ నెల 26,27 తేదీలలో హైదరాబాద్ లోని మల్కాపూర్ వద్దగల ఒక ఫంక్షన్ హాల్ లో భాజపా రాష్ట్ర కార్యవర్గసమావేశాలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర భాజపా నేతలతో బాటు కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, గంగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి సాధన్ సింగ్, మురళీధర్ రావు తదితరులు ఈ సమావేశాలకు హాజరవుతారు. మొదటిరోజున రాష్ట్ర పదాధికారుల సమావేశం, రెండవ రోజున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతాయి. ఇవి ఎన్నికలకు సన్నాహ సమావేశాలేనని వేరే చెప్పనవసరం లేదు. కనుక తెలంగాణా ప్రజలకు భాజపా ఏమి హామీలు ఇస్తుందో చూడాలి.