గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామసభలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఏటా అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంటుంది. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి ఈ ‘రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్’ (జాతీయ అవార్డు) దక్కింది. ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మి, సభ్యులు, స్థానిక అధికారులతో కలిసి ప్రతీ మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గ్రామసభలు నిర్వహించి, గ్రామ సమస్యలపై చర్చించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ కమిటీ సభ్యులు దేశ వ్యాప్తంగా గ్రామాలలో పర్యటించి ఇటువంటి ఉత్తమ గ్రామ పంచాయితీలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. ఇబ్రహీంపూర్ గ్రామపంచాయితీ నిర్వహణ తీరును పరిశీలించిన కమిటీ సభ్యులు, ఆ గ్రామాన్ని ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు.
సోమవారం లక్నోలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఉత్తరప్రదేశ్ సి.ఎం. ఆదిత్యనాథ్ యోగి చేతుల మీదుగా ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మి, రాష్ట్ర పంచాయితీ కార్యదర్శి నీతూ ప్రసాద్, జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సురేష్ బాబు ఈ అవార్డును అందుకొన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని మంత్రి హరీష్ రావు దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే. ఆ గ్రామానికి జాతీయ అవార్డు వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.